‘ఉగ’ అంటే నక్షత్ర గమనం. నక్షత్ర గమనానికి ఆది ఉగాది. అంటే సృష్టి ఆరంభమైన దినమే ఉగాది. చైత్ర శుక్ల పాడ్యమినాడు బ్రహ్మదేవుడు విశ్వాన్ని సృష్టించాడని, సృష్టి ఆరంభించిన (కృత యుగం) సంకేతంగా ఉగాది జరుపుకొంటారు. అలాగే సోమకుడు వేదాలను తిరస్కరించటంతో విష్ణువు మత్స్యావతారంలో అతడిని సంహరించి, వేదాలను తిరిగి బ్రహ్మకు అప్పగిస్తాడు. ఈ సందర్బంగా 'ఉగాది' ఆచరణలోకి వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి. ఇక ఒక్కో ఏడాది వచ్చే ఉగాదిని ఒక్కో పేరుతో పిలుస్తారు.
ఉగాది రోజు ఏం చేయాలి? ఉగాది పండుగ శోభ!!
ఉగాది రోజు ఉదయాన్నే తలంటు స్నానం చేసి కొత్త దుస్తులు ధరించాలి. మీ ఇష్ట దైవ దర్శనం చేసుకొని, పెద్దల ఆశీస్సులు తీసుకోవాలి. ఇంటిని మామిడి, పూల తోరణాలతో అలంకరించుకోవాలి. దైవార్చన, పంచాంగ పూజ చేయాలి. ఉగాది పచ్చడి, పిండివంటలు నైవేద్యంగా సమర్పించాలి. సాయంత్రం పంచాంగ శ్రవణం, కవిత్వ, సాహిత్య గోష్ఠులలో పాల్గొనటం ఆనవాయితీగా వస్తోంది.
షడ్రుచుల ఉగాది పచ్చడి తయారీ
ఉగాది పండుగలో ప్రధానమైనది ఉగాది పచ్చడి. తీపి, కారం, చేదు, పులుపు, వగరు, ఉప్పు వంటి షడ్రుచుల సమ్మేళనమే ఈ ఉగాది పచ్చడి. ఉగాది పచ్చడి తయారీకి సన్నగా తరిగిన మామిడి ముక్కలు, కప్పు చింతపండు రసం, అరకప్పు బెల్లం, కొద్దిగా వేప పువ్వు, టీ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు తీసుకోవాలి. వీటన్నింటిని ఒక గిన్నెలోకి తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా పచ్చడి చేసుకోవడం వెనుక గల అంతరార్థం ఏమిటంటే ఈ సంవత్సరమంతా మన జీవితంలో ఎదురయ్యే కష్టసుఖాలను సమానంగా స్వీకరించగల స్థిత ప్రజ్ఞతను సాధించడమే!
సంవత్సరాల పేర్లు- పురాణ గాథ
తెలుగు సంవత్సరాల వెనుక ఓ కథ ఉంది. నారద మహాముని ఓసారి విష్ణు మాయ వల్ల స్త్రీగా మారి, ఓ రాజును పెళ్లాడతాడు. వారికి 60 మంది పుత్రులు జన్మించారు. ఓసారి ఆ రాజు తన పుత్రులతో కలిసి యుద్దానికి వెళ్ళినప్పుడు కుమారులంతా చనిపోతారు. అప్పుడు పుత్రశోకంలో ఉన్న నారదుడిని ఆవరించిన మాయను తొలగించిన విష్ణువు, ఇది సంసారం అని హితబోధ చేశాడు. నీ పిల్లలు 60 సంవత్సరాలుగా కాలచక్రంలో తిరుగుతుంటారు అని వరమిస్తాడు. అవే మన తెలుగు సంవత్సరాలుగా ప్రస్తుతం వాడుకలో ఉన్నాయి.
ముఖ్యగమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.
No comments:
Post a Comment