తెలుగు సంవత్సరాలు 60 అని అందరికి తెలుసు, ప్రభవ నామ సంవత్సరంతో మొదలై అక్షయ వరకు ఉంటాయి. అసలు ఆ పేర్లు ఎలా వచ్చాయి? కేవలం 60 మాత్రమే ఎందుకు ఉన్నాయి తెలుసుకొందాం.
తెలుగు సంవత్సరాల వెనుక ఓ కథ ఉంది. ఒకానొక సమయంలో నారద ముని తనకన్నా గొప్ప భక్తుడు లేదు అని, తాను గొప్ప జ్ఞానీ అని, గర్వంతో విర్రవీగుతుంటాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు అతడికి జ్ఞానబోధ చేయాలని తలచి మాయ ఆవరించేలా చేస్తాడు. నారదుణ్ణి ఒక సరస్సుకి తీసుకెళ్లి అందులో స్నానమాచరించవలసిందిగా ఆజ్ఞాపిస్తాడు, నారదుడు అందులో దిగి స్నానం చేయగానే, అతని పూర్వ స్మృతిని మరచిపోయి, స్త్రీ రూపం ఎత్తుతాడు. తరువాత ఓ రాజును పెళ్లాడతాడు. వారికి 60 మంది పుత్రులు జన్మించారు. ఓసారి ఆ రాజు తన పుత్రులతో కలిసి యుద్దానికి వెళ్ళినప్పుడు కుమారులంతా చనిపోతారు. అప్పుడు పుత్రశోకంలో ఉన్న నారదుడిని ఆవరించిన మాయను తొలగించిన విష్ణువు, ఇది సంసారం అని హితబోధ చేశాడు. నీ పిల్లలు 60 సంవత్సరాలుగా కాలచక్రంలో తిరుగుతుంటారు అని వరమిస్తాడు. అవే మన తెలుగు సంవత్సరాలుగా ప్రస్తుతం వాడుకలో ఉన్నాయి.
మన తెలుగు సంవత్సరాల పేర్లు :
1. ప్రభవ, 2. విభవ, 3. శుక్ల, 4. ప్రమోదూత, 5. ప్రజోత్పత్తి, 6. ఆంగీరస, 7. శ్రీముఖ, 8. భవ, 9. యువ, 10. ధాత, 11. ఈశ్వర, 12. బహుధాన్య, 13. ప్రమాథి, 14. విక్రయ, 15. వృక్ష, 16. చిత్రభాను, 17. స్వభాను, 18. తారణ, 19. పార్థివ, 20. వ్యయ, 21. సర్వజిత్, 22. సర్వధారి, 23. విరోధి, 24. వికృతి, 25. ఖర, 26. నందన, 27. విజయ, 28. జయ, 29. మన్మథ, 30. దుర్ముఖి, 31. హేవలంభి, 32. విలంబి, 33. వికారి, 34. శార్వరి, 35. ప్లవ, 36. శుభకృత్, 37. శోభకృత్, 38. క్రోధి, 39. విశ్వావసు, 40. పరాభవ, 41. ప్లవంగ, 42. కీలక, 43. సౌమ్య, 44. సాధారణ, 45. విరోధికృత్, 46. పరీధావి, 47. ప్రమాదీచ, 48. ఆనంద, 49. రాక్షస, 50. నల, 51. పింగళ, 52. కాళయుక్త, 53. సిద్ధార్థి, 54. రౌద్రి, 55. దుర్మతి, 56. దుందుబి, 57. రుధిరోద్గారి, 58. రక్తాక్షి, 59. క్రోధన, 60. అక్షయ.
ఇలా 60 ఏళ్లు పూర్తయిన వారు షష్టి పూర్తి చేసుకుంటారు. అరవై ఏళ్ళ తర్వాత సంవత్సర చక్రం పూర్తయినట్లే మనిషి రెండో బాల్య దశకు వస్తాడట. అక్కడి నుంచి మనుషుల శరీరంలో మార్పులు మొదలవుతాయి, క్రమంగా జ్ఞాపకశక్తి తగ్గుతూ వస్తుంది చిన్న పిల్లల్లా ప్రవర్తిస్తుంటారు. అకారణంగా అలగటం అవీ ఇవీ తినాలనే కోరిక కలగటం, ఎక్కువ సేపు నిద్రపోవడం, చిన్న చిన్న విషయాలకే ఆనంద పడటం, కోపం తెచ్చుకోవడం, కన్నీళ్ళు పెట్టుకోవడం వంటి బాల్య చేష్టలన్నీ 60 తర్వాత మళ్ళీ ప్రారంభం అవుతాయి.అప్పటి నుంచి ప్రతిబిడ్డ తన తల్లి దండ్రులను బిడ్డలతో సమానంగా చూసుకోవాలని ధర్మశాస్త్రం చెపుతుంది.
No comments:
Post a Comment